Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేసీఆర్ మరో ఆకర్షణీయ పథకం... 52 రకాల వైద్య పరీక్షలిక ఉచితం!

  • ఇప్పటికే పలు సంక్షేమ పథకాలను దగ్గర చేసిన కేసీఆర్
  • 8న అధికారికంగా ప్రారంభం కానున్న టీ డయాగ్నోస్టిక్స్
  • ఖరీదైన ఆరోగ్య పరీక్షలు సైతం ఉచితం
ఇప్పటికే రైతుబంధు, ఉచిత జీవిత బీమా వంటి పథకాలతో దూసుకెళుతున్న కేసీఆర్ ప్రభుత్వం, మరో ఆకర్షణీయ పథకానికి రూపకల్పన చేసింది. 52 రకాల పరీక్షలను ఉచితంగా జరిపే 'తెలంగాణ నిర్ధారణ పరీక్షల పథకం' (టీ డయాగ్నోస్టిక్స్‌) అధికారికంగా ఈనెల 8న ప్రారంభం కానుంది. నిరుపేదలకు అవసరమైన వైద్య పరీక్షల విషయంలో, వారిపై పడే అదనపు ఆర్థిక భారాన్ని తప్పించేందుకే ఈ పథకాన్ని తెస్తున్నట్టు ఇప్పటికే కేసీఆర్ తెలిపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఈ పథకం హైదరాబాద్ లో కొనసాగుతుండగా, 50 పట్టణ ఆరోగ్య కేంద్రాల నుంచి వస్తున్న 5వేల మంది రక్త, మూత్ర నమూనాలను పరీక్షించి, రిపోర్టులను అందిస్తున్నారు.

ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు, పాత్రికేయులకు అందుతున్న ఉచిత వైద్య సేవల్లో భాగంగా, సేకరించిన నమూనాలను టీ డయాగ్నోస్టిక్స్‌ కే పంపుతుండగా, రాబోయే శుక్రవారం నుంచి ఇది అధికారికంగా ప్రారంభం కానుంది. ప్రారంభ దశలో హైదరాబాద్‌ పరిధిలోని 120 పట్టణ ఆరోగ్య కేంద్రాలకూ సేవలు అందుతాయని, ఆపై దశల వారీగా పాత జిల్లా కేంద్రాలన్నింటిలోనూ ల్యాబ్ లను ప్రారంభిస్తామని కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ కమిషనర్‌ వెల్లడించారు.

రక్త పరీక్షల కోసం అందుబాటులోఅత్యాధునిక ప్రయోగశాల ఉందని, రూ. 4 కోట్లతో దీనికి అదనంగా మరో ల్యాబొరేటరీని నిర్మించనున్నామని, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ, జిల్లా ఆసుపత్రులన్నీ దీని పరిధిలోనే ఉంటాయని అధికారులు వెల్లడించారు. నిత్యం కనీసం 10 వేల శాంపిల్స్ ను పరీక్షించే వీలుంటుందని, రిపోర్టులు ఆన్‌ లైన్‌ లో అందిస్తామని తెలిపారు.

రక్త, మల, మూత్ర పరీక్షలతో పాటు టైఫాయిడ్‌, డెంగీ, మలేరియా తదితర జ్వరాల నిర్ధారణకు, కాలేయం, మూత్రపిండాలు, థైరాయిడ్‌ స్థాయిని తెలుసుకునే పరీక్షలు, బ్లడ్ కొలెస్ట్రాల్‌, రక్తంలో మూడు నెలల చక్కెర సరాసరి స్థాయి తదితర పరీక్షల ఫలితాలను అందిస్తారు. వీటితో పాటు 13 పట్టణ సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోని ఎక్స్‌రే, ఆల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ పరికరాలు, నాలుగు ప్రాంతీయ ఆసుపత్రుల్లో సీటీ స్కాన్‌ మెషీన్లు, జిల్లా ఆసుపత్రిలో ఎంఆర్‌ఐ మెషీన్ ను కూడా టీ డయాగ్నొస్టిక్స్ పరిధిలోకి తేనున్నారు.
Telangana
KCR
T Diagnostics
Health Tests
Blood Test

More Telugu News